సాహిత్యం

Wednesday, April 22, 2020

సూక్తి మధురిమ

1. సత్యం తపోజ్ఞానమహింసతా చ
    విద్వత్ప్రమాణం చ సుశీలతా చ
    ఏతాని యో ధారయతే స విద్వాన్న
    కేవలం యః పఠతే స విద్వాన్.

భావం:- సత్యము, తపస్సు, జ్ఞానము, అహింస, పండితుల మాట గ్రహించుట, మంచి నడవడి- ఈ గుణాలను కలిగియున్న వాడే పండితుడు. గ్రంథాలను మాత్రమే చదివి ఈ గుణాలను కలిగి యుండని వాడు పండితుడు కాదు.


2. యథా చిత్తం తథా వాచో యథా వాచస్తథా క్రియాః
    చిత్తే వాచి క్రియాయాం చ సాధూనామేక రూపతా.

భావం:- సజ్జనులకు మనసెట్లుండునో మాటలట్లుండును. మాటలెట్లుండునో పనులట్లుండును. వారి మనస్సు, మాట, కర్మ ఒకే విధంగా ఉంటాయి.

3. త్యజన్తి మిత్రాణి ధనైర్విహీణః
    పుత్రాశ్చ ధారాశ్చ సుహృజ్జనాశ్చ
    తమర్థవన్తం పునరాశ్రయన్తి
    హ్యర్థో హి లోకే పురుషస్య బన్ధుః.

భావం:- ధనం లేని వానిని మిత్రులు, పుత్రులు, భార్య దగ్గరి వారును విడిచి వెళ్ళిపోతారు. అతడే ధనవంతుడైతే వారందరు వచ్చి అతనిని ఆశ్రయిస్తారు. లోకంలో ధనమే పురుషునికి బంధువు.

4. త్యాగ ఏకో గుణః శ్లాఘ్యః కిమన్యైః గుణరాశిభిః
    త్యాగాజ్జగతి పూజ్యన్తే పశుపాషాణ పాదపాః.

భావం:- త్యాగము ఒక్కటే లెక్కించవలసిన గుణము. ఇక ఇతర గుణాలెందుకు? సృష్టిలో పశువులు, శిలలు, వృక్షాలు సైతం త్యాగ గుణం వలనే గౌరవం పొందుతున్నాయి.

Monday, July 29, 2019

1. నాస్తి విద్యా సమం చక్షుః, నాస్తి సత్య సమం వ్రతం
    నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం.

భావం:- విద్యతో సమానమైన నేత్రం లేదు. సత్యముతో సమానమైన వ్రతము లేదు. కోరికతో సమానమైన దుఃఖం లేదు. త్యాగముతో సమానమైన సుఖము లేదు.

 2. దుర్జనః పరిహర్తవ్యో విద్యయాలంకృతోపి సన్,
     మణినా భూషితః సర్పః కిమసౌ న భయంకరః.

భావం:- విద్యచేత అలంకరింపబడినప్పటికీ దుర్జనుడు విడువదగినవాడు. అది ఎట్లనగా తలపై మణిచేత ప్రకాశిస్తున్నప్పటికీ పాము భయంకరమైనదే కదా.

3. మాతృవత్పర దారేషు పరద్రవ్యేషు లోష్ఠవత్,
    ఆత్మవత్సర్వ భూతేషు యః పశ్యతి స పండితః.

భావం:- ఎవడైతే ఇతర స్త్రీలను తల్లి వలె, ఇతరుల సంపదను మట్టి వలె, సమస్త ప్రాణులను తన వలె చూచునో అతడు పండితుడు.

4. రాజపత్నీ గురోః పత్నీ భ్రాతృ పత్నీ తథైవ చ,
    పత్ని మాత స్వమాతా చ పంచైతాః మాతరః స్మృతాః.

భావం:- రాజు భార్య, గురువు గారి భార్య, సోదరుని భార్య, భార్య తల్లి మరియు తన యొక్క తల్లి ఈ ఐదుగురును మాతృమూర్తులుగా చెప్పబడిరి.

5. జనితా చోపనేతా చ యశ్చ విద్యాం ప్రయచ్ఛతి
   అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః.

భావం:- జన్మనిచ్చిన వాడు, ఉపనయన సంస్కారం చేసినవాడు, విద్యనిచ్చిన వాడు, అన్నదానం చేసిన వాడు, భయం నుండి రక్షించిన వాడు తండ్రులుగా చెప్పబడుతున్నారు.

6. ఆలస్యం హి మనుష్యాణాం జీవనే చ మహా రిపుః
   నాస్త్యుద్యమ సమో బంధుః కుర్వాణో నావసీదతి.

భావం:- మానవులకు జీవితమునందు సోమరితనం గొప్ప శత్రువు. ప్రయత్నం చేయు స్వభావం బంధువు.ఎందుకనగా ప్రయత్నం చేయువాడు నాశనం పొందడు.

7. వచస్యేకం మనస్యేకం కర్మన్యేకం మహాత్మనామ్
    వచస్యన్యత్ మనస్యన్యత్ కర్మణ్య న్యద్దురాత్మనామ్.

భావం:- మహాత్ములైన వారి యొక్క మాట, మనస్సు, కర్మ ఒకే విధంగా ఉండును. దుర్మార్గుల యొక్క మాట, మనస్సు, కర్మ అనేక విధాలుగా ఉండును.

8. ఉత్తమం స్వార్జితం విత్తం మధ్యమం పితురార్జితమ్
    అధమం భ్రాతృ విత్తం చ స్త్రీ విత్తం అధమాధమమ్.

భావం:- తాను సంపాధించిన ధనం ఉత్తమమైనది. తండ్రి యొక్క సంపాధన మధ్యమము. సోదరుని యొక్క ధనము అధమము మరియు స్త్రీ ధనము అధమములో అధమము.

9. ఏకః స్వాదు న భుంజీత ఏకశ్చార్థాన్ న చింతయేత్
    ఏకో న గచ్చేదధ్వానం నైకః సుప్తేషు జాగృయేత్.

భావం:- రుచికరమైన పదార్థమును ఒక్కడే భుజించరాదు. కార్య ప్రయోజనములను గూర్చి ఒక్కడే ఆలోచించరాదు. మార్గమునందు ఒంటరిగా ప్రయాణించరాదు. నిద్రా సమయములందు ఒక్కడే మేల్కొనరాదు.

10. దుర్జనః ప్రియవాదీ చ నైత ద్విశ్వాస కారణమ్
      మధు తిష్ఠతి జిహ్వాగ్రే హృదయేతు హాలాహలమ్.

భావం:- ప్రియముగా మాట్లాడు దుర్మార్గుడు నమ్మదగిన వాడు కాదు. ఎందుకనగా అతడి నాలుక చివర తేనె ఉండును. కానీ హృదయంలో కాలకూట విషముండును.

11. శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్
      శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః.

భావం:- శోకము ధైర్యమును, శాస్ర్తాధ్యయనమును, సమస్తమును నశింప చేయును. కావున శోకముతో సమానమైన శత్రువు లేదు.

Thursday, July 25, 2019

సుభాషితాలు

                       :సుభాషితాలు:
1. "ఛాయాం కుర్వన్తి చాన్యస్య స్వయం తిష్టన్తి చాతపే,
     ఫలన్తి చ పరార్థాయ పాదపా ఇవ సజ్జనః"

భావం:- వృక్షాలు సజ్జనుల వలె తాము ఎండలో ఉంటూ ఇతరులకు నీడను ఇస్తాయి. మరియు ఇతరుల కొరకే ఫలాలను కూడా ఇస్తాయి.

2. కో అతి భారః సమర్థానాం కిం దూరం వ్యవసాయినామ్
    కో విదేశః సవిద్యానాం కః పరం ప్రియ వాదినామ్."

భావం:- సామర్థ్యం కలవారికి కష్టమైన పని అనేది ఉండదు. ప్రయత్నం చేసేవారికి దూరం ప్రదేశం కదా అని భావించరు. విద్యావంతులకు విదేశం అనే భయం ఉండదు. ప్రియంగా మాట్లాడే వారికి శత్రువులు ఉండరు.

Thursday, January 10, 2019

పాల్కురికి సోమన

పాల్కురికి సోమనాథుని కృతులు

"బసవపురాణంబు, పండాతారాధ్య చరితంబు, ననుభవసారమును, చతుర్వేద సార సూక్తులు, సోమనాథ భాష్యంబును, రుద్రభాష్యంబును, బసవ రగడ, గంగోత్పత్తి రగడ,  శ్రీ బసవాధ్య రగడయు, సద్గురు రగడ, చెన్నమల్లు సీసములు, నమస్కార గద్య, వృషాధిప శతకంబు, నక్షరాంక గద్య పద్యముల్, పంచప్రకార గద్య, అష్టకము, పంచకము, నుదాహరణ యుగము నాదియగు కృతుల్ భక్తహితార్థ బుద్ధి చెప్పెనని భక్త సభలలో చెల్లుచుండు.

తెలుగు కృతులు:- 

అనుభవ సారము, వృషాధిప శతకము, చతుర్వేద సారము, చెన్నమల్లు సీసములు.


Saturday, November 24, 2018

నీతి కథ

: ధర్మాచారం :                                                        ధర్మానికి   " పుణ్యము, నీతి" అని అర్థాలు. ధర్మానికి అనుగుణమైన ఆచరణను కలిగి ఉండటమే ధర్మాచారం.  సకల నీతి కథా నిదానంలో-   మణికర్ణిక తన భర్తతో మంచంపై వున్న సమయంలో చీమల గుంపు మంచంవైపుకు వచ్చి ఆగుతుంది. మంచం కోడు అడ్డం వచ్చిందని చీమలు తమ రాజుకు చెప్తాయి. చీమల రాజు అడ్డం వచ్చిన దాన్ని ఎత్తివేయమంటాడు. జంతుభాష తెలిసిన భర్త చీమల భాష విని పెద్దగా నవ్వుతాడు. నవ్విన కారణం చెప్పమని మణిరేఖ బలవంత పెడుతుంది. చెపితే తన చావుకు వస్తుందని భర్త చెప్పినా వినని మణిరేఖ చెప్పక పోతే తానే చనిపోతానంటుంది. ఆమెకు కారణం చెప్పదలచిన భర్త శ్మశానంలో చితిని పేర్పించుకుంటాడు. భార్య కు చెప్పి ప్రాణాలు విడవాలని అనుకుంటాడు. ఆ సమయంలో ఒక చింబోతుతో మేక నూతిలోని గడ్డి తెమ్మంటుంది. ఆ చింబోతు నూతిలోకి పోతే చస్తాను. 'నా ప్రాణాలు పోయే పని చెప్పిన నీవు నాకెందుకు' అని పలికి మేకను విడిచి పెడుతుంది. చింబోతు మాటలు విన్న రాజుకు జ్ఞానోదయమవుతుంది. తాను చితిని పేర్చుకున్నా మనసు మార్చుకోని మణిరేఖను వదిలించుకొని, పతిభక్తి గల మరొక స్త్రీని పెండ్లాడి సుఖంగా వుంటాడు.